యోగ యాజ్ఞవల్క్యము
మొత్తం 504 శ్లోకములలో ప్రాచీన యోగశాస్త్రమును వివరించిన ఈ గ్రంథం దాదాపుగా రెండువేల సంవత్సరముల క్రిందటిది. ప్రాచీనమైన ఈ గ్రంథంలో వైదిక సాంప్రదాయానుసారమైన యోగమార్గం వివరింపబడి గోచరిస్తున్నది. వేదకాలపు మహర్షియైన యాజ్ఞవల్క్యఋషి తన సతీమణియైన బ్రహ్మవాదిని గార్గికి చేసిన బోధగా ఈ గ్రంథం చెప్పబడింది.
ఈ గ్రంథం పన్నెండు అధ్యాయములతో నిండి ఉన్నది. వీనిలో, వైదికధర్మమార్గము, దాని విధులతోబాటు, వర్ణాశ్రమధర్మములు, అష్టాంగయోగము మరియు దాని విభాగములైన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, తంత్రసాధనయైన కుండలినీయోగము మొదలైనవి ఒక్కొక్కటి సవివరముగా చెప్పబడినాయి. ఆధ్యాత్మికమార్గంలో జ్ఞాన, కర్మ, యోగముల ప్రాముఖ్యతను వివరించిన యాజ్ఞవల్క్యులు, విధిపూర్వకంగా చేయవలసిన వైదికనిత్యకర్మలను చేస్తూనే, అష్టాంగయోగమును కూడా ఆచరించాలని బోధిస్తారు. వైదికధర్మమార్గమును, అష్టాంగయోగమును, తంత్రమును సమన్వయం చేయాలన్న ప్రయత్నం ఈ గ్రంథం లో మనకు గోచరిస్తుంది. యోగాభిమానులకు ఈ ప్రాచీనగ్రంథం ఎంతో ఉత్తేజాన్ని కలిగించి, వారిని దైవమార్గంలో ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాము.